ఢిల్లీ ఆగ్రహంతో దిగొచ్చిన పురందేశ్వరి
ఢిల్లీ ఆగ్రహంతో ఏపీ బీజేపీ జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎట్టకేలకు దిగొచ్చారు. టీడీపీ, వైసీసీ, జనసేన పార్టీల్లో టికెట్లు దక్కని నేతలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ఏపీ బీజేపీ… ఆ పని మాత్రం చేయడం లేదు. రాజకీయాలతో తమకు సంబంధం లేదన్నట్టు పురందేశ్వరి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి.
అంతేకాదు, తమ పార్టీలోకి వచ్చే వారిని టీడీపీలో చేరాలని కూడా ప్రోత్సహిస్తున్నారని ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఒకవేళ ఎవరైనా టీడీపీ నాయకులు బీజేపీలో చేరుతామని ముందుకొస్తే , ఆ సమాచారాన్ని సదరు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బీజేపీ పెద్దలు పురందేశ్వరికి చీవాట్లు పెట్టారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తన పదవికి ఎసరు వస్తుందని గ్రహించిన పురందేశ్వరి అప్రమత్తమయ్యారు. మొదట ఆమె అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో ఆమె మాట్లాడారు. ఇటీవల కేంద్రమంత్రి రాజనాథ్‌సింగ్‌తో కాపు రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు. ఆ తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త బీజేపీలో చేరారు. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన కొందరు బీజేపీలో చేరడం విశేషం.
తాజాగా చేరికలపై పురందేశ్వరి ప్రత్యేకంగా మాట్లాడ్డం విశేషం. ఏపీలో బీజేపీపై ఆదరణ పెరిగిందన్నారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నట్టు ఆమె చెప్పారు. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని అసంతృప్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ ఆదేశాలతో అయిష్టంగా అయినా పురందేశ్వరి ఆ పని చేయక తప్పడం లేదు.