పాత్రికేయుల సమస్యలపై పోరాటమే శరణ్యం, మామిడి సోమయ్య పిలుపు

0

హైదరాబాద్, జనవరి 21:జర్నలిస్టుల హక్కుల సాధన,సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందని, పోరాటాల ద్వారానే సమస్యలు సాధించుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య అన్నారు.రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని, అందుకు జర్నలిస్టులు అప్రమత్తమై ఫెడరేషన్ నాయకత్వంలో పోరాటం చేసేందుకు
సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు.మంగళవారం హైదరాబాద్ రాంనగర్ లోని రాజ్ ఫంక్షన్ హాలులో టీడబ్ల్యూజేఎఫ్ హైదరాబాద్ జిల్లా సన్నాహక సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మామిడి సోమయ్య మాట్లాడుతూ,జర్నలిస్టుల హక్కులు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయని,పాలకులు ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా దాటవేస్తున్నారని ధ్వజమెత్తారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలో కొనసాగిన గత ప్రభుత్వం జర్నలిస్టులను పూర్తిగా విస్మరించి తీరని అన్యాయం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని దుయ్యబట్టారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులు ఇవ్వలేక పోయిందని,రివ్యూ కమిటీ పేరుతో కాలయాపన చేసి చివరికి జర్నలిస్టులకు ఆందోళన కలిగించే జీవో 252 జారీ చేసిందని అన్నారు.రాబోయే ఒకటి,రెండు నెలలు జర్నలిస్టులకు కీలకమని,ఎందుకంటే అక్రెడిటేషన్ కార్డులను బాగా తగ్గిస్తారనే ప్రచారం జరుగుతోందని అన్నారు.అక్రెడిటేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని,రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పెన్షన్ స్కీం,హెల్త్ కార్డులు, దాడుల నివారణకు ప్రత్యేక కమిటీలు,జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తదితర డిమాండ్ల సాధనకై ఫెడరేషన్ ఆధ్వర్యంలో బలమైన పోరాటం చేయాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు.మీడియా సంస్థలు, జర్నలిస్టుల జనాభా అధికంగా ఉన్న హైదరాబాద్ జిల్లాలో ఐక్యత కొరవడిందని,ఫెడరేషన్ ద్వారా జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయాలని అన్నారు.ఫెడరేషన్ రాష్ట్ర కో- కన్వీనర్లు పులిపలుపుల ఆనందం,బండి విజయ్ కుమార్, తన్నీరు శ్రీనివాస్, సీనియర్ సభ్యులు బొల్లం శ్రీనివాస్, సీహెచ్ వీరారెడ్డి తదితరులు మాట్లాడుతూ, హైదరాబాద్ లోని ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యులంతా కలిసిరావాలని, జర్నలిస్టుల సమస్యల సాధనకు రాబోయే రోజుల్లో నిర్వహించే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కె. పాండురంగారావు,నాగరాజు, యర్రమిల్లి రామారావు,హెచ్ యూజే నాయకులు వర్కాల కృష్ణ, గజ్జల వీరేశం,ఎన్ సీహెచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మామిడి సోమయ్య పలువురు నూతన జర్నలిస్టులకు ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా సభ్యత్వం ఇచ్చారు.
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అడ్ హక్ కమిటీ ఏర్పాటు
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) హైదరాబాద్ జిల్లా సన్నాహక సమావేశంలో జిల్లా అడ్ హక్ కమిటీ ఏర్పాటైంది. కమిటీ కన్వీనర్ గా వి. రవికుమార్(బీజే టీవీ),కో- కన్వీనర్లుగా గజ్జల వీరేశం(సాక్షి), బి.గోపాల్(ఆంధ్రజ్యోతి),వర్కాల కృష్ణయ్య (నమస్తే తెలంగాణ), కె.నర్సింగ్ రావు(సూర్య),ఆర్. వెంకటేశ్వర్లు
(ఆంధ్రప్రభ), వి.శ్రీనివాస్(మనం బ్యూరో),రాజేష్ గౌడ్(వార్త),బి. శ్రీనివాస్(ప్రజాజ్యోతి),ఎం.శ్రీశైలం(వాయిస్ టుడే),ఆర్. శ్రీనివాస్ గౌడ్(సాక్షి డిజిటల్ న్యూస్), వెంకట్(యామ్స్ న్యూస్ ఇంగ్లీష్ డైలీ), సీహెచ్ బ్రహ్మం(ఏబీ న్యూస్), వేణుగోపాల్(హెచ్ డీఎస్), పి.సంతోష్(టీఆర్ 9 న్యూస్) తదితరులు కమిటీలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *