జర్నలిస్టుకు సహాయం చేసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతల
పెద్దపెల్లి జిల్లా:పెద్దపల్లి జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకుడు, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటి సభ్యుడు బందెల రాజశేఖర్ ను పలువురు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజే ఎఫ్) రాష్ట్ర నాయకులు పరామర్శించారు.ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం,బండి విజయ్ కుమార్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు తదితరులు శుక్రవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండంలోని ఆయన స్వగ్రామం చిన్న రాతుపల్లికి వెళ్ళి రాజశేఖర్ ను పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రమాదానికి గురైన రాజశేఖర్ కుడి కాలుకు బలమైన గాయం కావడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి కుడి కాలును 70 శాతం తొలగించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 15 సంవత్సరాలకు పైగా ప్రజాశక్తి, నవతెలంగాణ పత్రికల్లో పూర్తికాలం రిపోర్టర్ గా పని చేసిన రాజశేఖర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలును కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. అత్యంత పేదరికంలో ఉన్న రాజశేఖర్ ప్రస్తుతం పని చేయలేని స్థితిలో ఉన్నాడని,ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఆర్థికంగా ఆదుకోవాలని సోమయ్య కోరారు. ఈ సందర్భంగా పలువురు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు,కరీంనగర్ జిల్లా నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య బాధిత జర్నలిస్టు రాజశేఖర్ కు కుటుంబానికి ఆసరాగా ఉంటామని హామీ ఇచ్చారు.