జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమ కార్యాచరణ, అధ్యక్షుడు యం.సోమయ్య

0

కరీంనగర్,జూన్ 15:రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై త్వరలో ఉద్యమ కార్యాచరణ ఉంటుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు.పాత్రికేయుల సమస్యల పై సమిష్టి పోరాటానికి సన్నద్దం కావాలని ఆయన సోమయ్య పిలుపునిచ్చారు. జర్నలిస్టులు ఎవరికీ భయపడకుండా నిస్వార్థంగా, నిర్భయంగా వృత్తిలో ముందుకు వెళ్లాలని కోరారు. ఆదివారం కరీంనగర్ లోని టీడబ్ల్యూజేఎఫ్ కార్యాలయంలో ఫెడరేషన్ జిల్లా సీనియర్ ఉపాధ్యక్షుడు నల్లగొండ సత్తయ్య అధ్యక్షతన జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ…రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయని, ముఖ్యంగా గ్రామీణ విలేకరుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా ద్రోహం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇంత వరకు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. సమస్యలపై పోరాడేందుకు జర్నలిస్టులంతా కలిసి రావాలని, రాబోయే రోజుల్లో సమస్యలపై బలమైన పోరాటం చేయడానికి సిద్దం కావాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రెండు జర్నలిస్టు సంఘాలు పాలకుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలను విస్మరించాయని ఆయన విమర్శించారు. అలాంటి సంఘాల పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పాలకుల పక్షాన చేరి పదవులు పొంది జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించలేని సంఘాలకు సమస్యలపై నిజాయితీగా పోరాడుతున్న టీడబ్ల్యూజేఎఫ్ సంఘాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఇతర సంఘాల పట్ల నమ్మక విశ్వాసం కోల్పోయారని,అందుకే ఆయా సంఘాల నుంచి పెద్ద ఎత్తున టీడబ్ల్యూజేఎఫ్ లో చేరుతున్నారని చెప్పారు.రాబోయే రెండు మూడు మాసాల్లో అన్ని జిల్లాల్లో యూనియన్ మహాసభలు పూర్తి చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభ నిర్వహిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐఎఫ్ డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫెడరేషన్ ను బలోపేతం చేయాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, పాలకుల వివక్ష వల్ల జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడి బాధ్యతలను నల్లగొండ సత్తయ్యకు అప్పగిస్తూ జిల్లా కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.అనంతరం సంఘం సభ్యులకు రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఫెడరేషన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, ఫెడరేషన్ నాయకులు గాదె కరుణాకర్ రావు, సిహెచ్ వెంకట్ రాజు, అతికం రాజశేఖర్, కొమ్ము గణేష్, చట్ల శంకర్, గుండి కిరణ్, సురేష్, శంకర్ రెడ్డి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *