తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు.తీన్మార్ మల్లన్న
హైదరాబాద్:దేశంలోని అన్ని సామాజిక వర్గాలు, వారి వాస్తవ స్థితిగతుల లెక్కలను శాస్త్రీయంగా చేపట్టి ఆ దిశగా చర్యలు చేపట్టినప్పుడే అంతరాలు లేని సమాజ నిర్మాణం జరుగుతుందని సంవిధాన్ సమ్మన్ సమ్మేళన్ జాతీయ కన్వీనర్ డాక్టర్ అనిల్ జైహింద్ అన్నారు.దేశంలో కుల గణన చేపట్టే వరకు మా ఉద్యమం క్రమక్రమంగా మరో స్వాతంత్ర్య సమరంగా కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ లో జరిగిన కుల గణన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ బిసి ఉద్యోగుల ఫెడరేషన్ నిర్వహించింది.కార్యక్రమానికి ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు దేవల సమ్మయ్య సబాద్యక్షత వహించారు. ప్రధాన వక్తలుగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు,జస్టిస్ బి చంద్రకుమార్ ,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ,ప్రొఫెసర్ కె మురళీ మనోహర్,ఐ తిరుమలి ,పి ఎల్ విశ్వేశ్వరరావు, ఎస్ సింహాద్రి, డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్, దుర్గం రవీందర్, సోగరా బేగం, డాక్టర్ వేణు యాదవ్, వరంగల్ శ్రీనివాస్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తదితరులు పాల్గొని ప్రసంగించారు.. ఈ సందర్భంగా సమావేశంలో జస్టిస్ బి చంద్రకుమార్ మాట్లాడుతూ రాజ్యాంగంలో అన్ని వర్గాలకు సమానమైన హక్కులు కల్పించాలని స్పష్టంగా ఉందన్నారు. అయినప్పటికీ పాలకుల నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి కారణంగా దేశంలో వివక్షత, అణిచివేత, పేదరికం పెరుగుతుందన్నారు.ఇందుకు శాస్త్రీయంగా కుల గణన నిర్వహించి, ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టినప్పుడు ఈ దేశం త్వరితగతిన పురోగతి చెందుతుందన్నారు. డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ బలహీన వర్గాలకు మాత్రమే 50% లోపు రిజర్వేషన్లు అనే నిబంధనను అమలు చేయడం అన్యాయం అన్నారు.వెనుకబాటు తనం ప్రాతిపదికన ప్రయోజనాలు కల్పించాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నప్పటికీ పేద వర్గాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని పేర్కొన్నారు.15(6)16(6) ఆర్టికల్స్ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ల కల్పన అశాస్త్రీయంగా ఉంది అన్నారు. పరిమాణాత్మక సమాచారం లేకుండా రిజర్వేషన్లు కల్పించడం ఎలా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు. దేశంలోని బలహీన వర్గాల జీవనస్థితి గతులను సమగ్రంగా తెలుసుకోవడానికి కుల గణనను చేపట్టాలని దశాబ్దాలుగా ఆ వర్గాల నుండి డిమాండ్ వస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన విమర్శించారు.ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీకి అన్యాయం జరిగిన అండగా నిలబడతానని ప్రకటించారు.ఈ రాష్ట్రానికి ఓసీల నుండి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని అన్నారు. వచ్చే ఎన్నికల అనంతరం ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారని తెలియజేశారు,రాష్ట్రంలో తాను ఇప్పటికే కులగణన కార్యక్రమమును చేపట్టానని ఏ నియోజకవర్గంలో అగ్రవర్ణాల సంఖ్య ఎంతో లెక్కలు తీస్తున్నాను అని అన్నారు. వారి లెక్కలు తెలిసిన తర్వాత అంత బీసీలే అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణాలలోని పేదలు కలిసి రాష్ట్రంలో బహుజన రాజ్య స్థాపన తన జీవిత లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 15(4) 15(5),16(4) ప్రకారం బీసీ కులాలను సామాజికంగా విద్య పరంగా వెనుకబడిన తరగతులకు గుర్తించారు కానీ వీరికి సరైన న్యాయం జరుగుతుందా అని అన్నారు. దేశంలోని 90 శాతం సంపదకు యజమానులు ఉన్న ఆధిపత్య కులాలకు ఈ డబ్ల్యూఎస్ పేరిట 10% రిజర్వేషన్లు ఇచ్చిన బిజెపి ప్రభుత్వం, బీసీల పట్ల మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని తెలిపారు.ఈ కార్యక్రమం సమన్వయకర్తలుగా సతీష్ కొట్టే,టి తుల్జా రామ్ సింగ్, వినోద్ కురువ,డాక్టర్ పి విజయ్ కుమార్, గిల్లా భద్రయ్య, వంశీకృష్ణ గోపాల్ లు వ్యవహరించారు.ఈసమావేశంలో పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు.సభ ఏకగ్రీవంగా కోరింది.కుల సర్వే అనంతరమే 42 శాతం రిజర్వేషన్ల తో స్థానిక సంస్థ ఎన్నికలను నిర్వహించాలని సభ డిమాండ్ చేసింది. త్వరలోనే కుల సర్వే చేపట్టాలని సమావేశాలు నిర్వహిస్తామని ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు దేవుళ్ళ సమ్మయ్య తెలిపారు.